APPSC Group 1 Mains Ratio Issue : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు ఎపీపీఎస్సీని కోరుతున్నారు. గత ప్రభుత్వం పరీక్ష నిర్వహించిన విధానంలో లోపాలు, సిలబస్‌లో మార్పులు, ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ వల్ల తాము నష్టపోయామని న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్దం కాలేక ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయామని, ఎంపిక నిష్పత్తి పెంచి తమకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలన్న కల నెరవేర్చేలా సహకరించాలని విన్నవిస్తున్నారు.
హడావుడిగా నోటిఫికేషన్‌ను జారీ : ప్రభుత్వ కొలువు సాధించాలన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవిత కలను గత వైఎస్సార్సీపీ సర్కారు నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్, కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షలాది మంది నిరుద్యోగులు నాలుగేళ్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడంతో వారి ఆగ్రహంతో ఎన్నికల్లో ఎదురు దెబ్బతగులుతుందనే ఆందోళనతో గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా గ్రూప్ 1,2 నోటిఫికేషన్‌ను జారీ చేశారు. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం 81 పోస్టుల భర్తీకి మాత్రమే ఎపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 ప్రకటన జారీ చేసింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు - ఎప్పుడంటే
మా కల చెరిపేశారు : గతంలో ఉన్న సిలబస్‌ను మార్పులు చేసి, నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్ష పెట్టనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. పైగా అభ్యర్థులకు పరీక్షకు సిద్దమయ్యేందుకు సరైన సమయం ఇవ్వకుండా ఆఘమేఘాలపై మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులు చేసినందున ప్రిపరేషన్‌కు మరింత సమయం ఇవ్వాలన్న వేలాది మంది అభ్యర్థుల డిమాండ్‌ను గత ప్రభుత్వంలో ఎపీపీఎస్సీ కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఎన్నికల విధులతో దీంతో చాలా మంది సరిగ్గా ప్రిపేర్ కాక అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. దీంతో తమ కల చెరిపేశారంటూ వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
న్యాయం చేయాలని కోరుతున్న అభ్యర్థులు : గ్రూప్ 1 మెయిన్స్‌కు ఇప్పటికే 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో వేలాది మంది మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పటికే గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినందున గ్రూప్ 1కూ ఇదే తరహాలో అభ్యర్థులను ఎంపిక చేసి న్యాయం చేయాలని ఎపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ సహా సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్‌ను కలసి వేడుకుంటున్నారు. తాము తీవ్రంగా నష్టపోయిన దృష్ట్యా న్యాయం చేయాలని కోరుతున్నారు.
వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో తాము పడ్డ బాధలను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలసి చెప్పుకున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నాపత్రంలో చాలా తప్పులు ఇచ్చారని, దీనివల్ల తాము అర్హత సాధించలేకపోయినట్లు తెలిపారు. సిలబస్‌లో మార్పులు చేయడం సహా పరీక్ష విధానంలో మార్పులు తేవడం వల్ల నష్టం జరిగినట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రిలిమినరీ నిర్వహించడం వల్ల ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల విధుల్లో ఉండి ప్రిపేర్ కాలేక పోయినట్లు తెలిపారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిన పరిస్ధితుల్లో తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు.
గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 లో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సహా పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఎపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధను కలసి వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలిచ్చారు.
'గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు' - విచారణకు అభ్యర్థుల డిమాండ్