TTD EO Focus on Providing Delicious And Clean Food to Devotees in Tirumala : తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు మరింత రుచిగా, శుచిగా అందించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి ప్రక్షాళనకు టీటీడీ ప్రస్తుత ఈవో (EO) శ్యామలరావు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్నే కాదు దర్శనం తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్నీ భక్తులు అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ 2 లక్షల మంది భోజనం చేస్తారు. కానీ జగన్ జమానాలో అన్నప్రసాద వితరణపై ఎన్నడూలేనన్ని విమర్శలు వెల్లవెత్తాయి! అన్నం ఉడికీ ఉడకకుండా, సాంబారు, ఇతర ఆహార పదార్థాలు రుచికరంగా లేకుండా వడ్డించారనే పాపాల్ని నాటి పాలకులు మూటగట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను సెట్‌రైట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ EOగా శ్యామలరావును పంపారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొండపై ఒక్కో వ్యవస్థను ఆకళింపు చేసుకుని గాడిలో పెడుతున్న శ్యామలరావు అన్నదానం నాణ్యతపై దృష్టి సారించారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడారు. అక్కడి సిబ్బందికి తగిన సూచనలిచ్చి అన్నప్రసాద నాణ్యతను పునరుద్ధరించారు.