TSRTC Increased Buses For Voters :సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13 వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రయాణికులు హైదరాబాద్ నగరం నుంచి తరలివెళ్తున్నారు. తమ విలువైన ఓటును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ బస్సులను పెంచనుంది. ఎమ్జీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్ ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మీయాపూర్ నుంచి అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రజల అవసరాలనే కొంత మంది ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ వారు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
Voters Election Journey Difficulties : ఉపాధికోసం హైదరాబాద్ వలసవచ్చిన వారు ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి సొంతూళ్లకు పయనమవుతున్నారు. బస్టాండ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. యువత, పెద్దవారు, వృద్ధులు తమ సొంత ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బస్సుల్లో రద్దీ నెలకొంటుంది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన టీఎస్ఆర్టీసీ ఎన్నికల దృష్ట్యా మూడు రోజుల పాటు అదనపు బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Bus Stands Crowded With Passengers :ప్రజల రవాణా కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పినప్పటికీ సౌకర్యాల్లో కొరత ఉందంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలెదురైనా కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఓట్ల పండుగ కోసం నగరవాసులు పల్లెబాట పట్టారు. తమ సొంత ఊర్లో ఓటేసేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలతో నగరంలోని ప్రయాణ ప్రాంగణాలైన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
"మేము ఓటు వేయడానికి విజయవాడ వెళ్లాలి. బస్టాండ్‌కు వచ్చి రెండు గంటలు అవుతుంది. ఏ బస్సు చూసిన రద్దీగా ఉన్నాయి. ఏ బస్సు వచ్చినా ఆన్లైన్ రిజర్వేషన్ అంటున్నారు. ప్రైవేటు వాహనాలకు వేళ్దామంటే వారు అధిక ధరలను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి"-ఓ ప్రయాణీకుడు