Tsrtc Hyderabad Latest News :రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 10 గంటలు కాకముందు నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే ఎంతో భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అలాగే రాత్రి వేళల్లో సైతం వేడి ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు కూడా ఎండలు దంచికొడతాయని హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలుల తీవ్రత కారణంగా ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌ఆర్టీసీ.. గ్రేటర్ హైదరాబాద్ జోన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే.. సిటీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య బస్సుట్రిప్‌లను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
నగరంలో పగటి వేళలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉండటం వల్ల ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉందని.. కాబట్టి ఈ సమయంలో బస్సు ట్రిప్‌లను తగ్గించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అలాగే.. నగరంలోని అన్ని రూట్లలో కూడా ఉదయం 5 గంటల నుంచి బస్సులు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొంది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా బస్సు సర్వీస్‌లు యథావిధిగానే ఉంటాయని చెప్పింది. కాబట్టి, ప్రయాణికులు మార్పులను గమనించి టీఎస్‌ఆర్టీసీకి సహకరించాలని కోరింది.