రేగళ్లగుంపులో గర్భశోకం - ఆరోగ్య సదుపాయాలు లేక ఏడాదిలో 9మంది పిల్లలు మృతి Tribal Areas Problems in Bhadradri :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెం ‘రేగళ్లగుంపు’లో 45 కుటుంబాలు ఉన్నాయి. 197 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు 34 మంది. బాలింతలు 13 మంది. గర్భిణులు 8 మంది ఉన్నారు.
రేగళ్లగుంపునకు వెళ్లాలంటే అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు గ్రామం నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో 7 కిలోమీటర్లు కాలినడకన కొండల్లో రాళ్లు రప్పలు, ముళ్లపొదల్లో ఏడు వాగులు దాటి వెళ్లాలి. ఇక ఎవరైనా అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం వారి బాధ వర్ణనాతీతం. ఇక గర్భిణులకు వైద్య సిబ్బంది నెలనెలా పరీక్షలు చేసి మందులు ఇవ్వాలి. ఐసీడీఎస్ నుంచి పౌష్టికాహారం అందించాలి. కానీ ఇవేవి సరిగా జరగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తత్ఫలితంగా బిడ్డలు అనారోగ్యంతో పుట్టి శిశుమరణాలు సంభవిస్తున్నాయని వాపోతున్నారు.
ఇంటింటికి రేషన్.. గిరిజనుల పరేషాన్
Lack of Education Facilities on Traibal Areas : రేగళ్లగుంపులో ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని (Anganwadi Centers in Tribal Area) ఏర్పాటు చేస్తే తమకెంతో ప్రయోజనముంటుందని గిరిజనులు వేడుకుంటున్నారు. అందరిలాగే తమ బిడ్డలను చదివించాలనుకుంటున్నామని చెబుతున్నారు. తాము ఎలాగో చదువులకు నోచుకోలేదని కనీసం తమ బిడ్డలకైనా విద్యాబుద్ధులు నేర్పించాలని వేడుకుంటున్నారు. చెలిమెల్లో నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని కనీసం చేతిపంపైనా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"20 సంవత్సరాలు అవుతుంది మా ప్రాంతంలో కనీసం ఒక్క బోరు కూడా లేదు. ఎలాంటి సదుపాయాలు లేవు. చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చినా అత్యవసర చికిత్స కోసం తీసుకెళదామన్నా ఇక్కడ ఆసుపత్రి లేదు, రోడ్లు కూడా లేవు. ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం 9 మంది పిల్లలు చనిపోయారు. కొంతమందికి పిల్లలు జన్మించి రెండు, మూడు రోజుల్లో మరణిస్తున్నారు. నీళ్లు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు. కనీసం చేతి పంపు అయినా ఇస్తే బాగుంటుంది. పని చేసుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పిస్తే మాకు అసరాగా ఉంటుంది. మేము ఎలాగో చదువుకోలేదు ఇక్కడ బడి నిర్మిస్తే మా పిల్లలు అయినా చదుకుంటారు. అందుకు ప్రభుత్వం ఇక్కడ బడి నిర్మించాలని కోరుకుంటున్నాం."- గ్రామస్థులు
ఒళ్లంతా రామనామం - శరీరమంతా శ్రీరాఘవుడి టాటూలు పొడిపించుకున్న ఈ తెగ గురించి తెలుసా?
అసుపత్రులు లేక అనంతలోకాలకు : అధికారులు మాత్రం గొత్తికోయ మహిళలు గర్భం దాల్చాక ఆసుపత్రికి రావడంలేదని వైద్య సిబ్బంది గూడెంలోకి వెళ్లినా పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. పసికందులను ఇంట్లోనే వదిలి పనులకు వెళ్తుండటం వల్ల సమయానికి పాలు అందకనే చిన్నారుల ఆరోగ్యం పాడవుతోందని అంటున్నారు.
మృతి చెందిన శిశువులు ఇళ్ల వద్ద జరిగిన కాన్పుల్లోనే పుట్టారని వీరిలో ముగ్గురు వారి తల్లిదండ్రులకు నాలుగో సంతానం కాగా నలుగురు మూడో సంతానం. ఇద్దరు రెండో సంతానమని చెప్పారు. పోషకాహారలోపంతోపాటు గిరిజనులకు కుటుంబ నియంత్రణపై (Awareness on Family Planning ) అవగాహన లేమి, మూడు నాలుగు కాన్పుల వల్ల తల్లుల్లో రక్తహీనత సమస్యలు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
వసతుల లేమితో గిరిజనం పాట్లు