Telangana Youth Loses Money In Online Games : బుద్ధిగా చదువుకునే స్టూడెంట్ గంజాయి స్మగ్లర్‌గా మారాడు. కార్పొరేట్ కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్న ఉద్యోగి దొంగయ్యాడు. క్యాంపస్ సెలక్షన్లో ఐటీ కంపెనీలో జాబ్ సాధించిన యువకుడు నేరాల బాట పట్టాడు. ఒక బ్యాంకు ఉద్యోగి ఖాతాదారుల సొమ్ము 50 లక్షలు రూపాయలను సొంత అకౌంట్‌కు మళ్లించుకున్నాడు. ఈ విధంగా ఎంతోమంది ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా అప్పులపాలవుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఏటా రూ.10 కోట్ల మేర బాధితులు నష్టపోతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్ మోసాలిలా : ఆన్‌లైన్ గేమింగ్‌లో రెండు పద్ధతులున్నాయి. అవి స్కిల్ గేమ్, ఛాన్స్ గేమ్. స్కిల్‌గేమ్‌కు దేశంలో అనుమతి ఉన్నప్పటికీ వాటికి తెలంగాణలో నిషేధం. ఛాన్స్ గేమ్ దేశం మొత్తంలో నిషేధం ఉంది. స్కిల్ గేమ్‌లో మూడు ముక్కలాట, రమ్మీ ఉంటే ఛాన్స్ గేమ్‌లో మాత్రం ప్రిడిక్షన్ ఉంటాయి. ఆడేందుకు లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి. తొలుత రూ.200, రూ.300, 2-3 వేల రూపాయల వరకూ గెలిపిస్తూ లాభాల ఆశ చూపిస్తారు. అత్యాశతో రూ.5-10వేల వరకూ వెళ్లారంటే కేటుగాళ్ల చేతికి చిక్కినట్టే.
గుర్తింపు పొందిన వారితో ప్రచారం : ఆన్‌లైన్ బెట్టింగ్/గేమింగుల్లో ఆనందం ఆదాయం సొంతం చేసుకోవచ్చంటూ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా పిల్లలు, యువతను ఆకట్టుకుంటున్నారు. యూట్యూబ్, రీల్స్ ద్వారా గుర్తింపు పొందినటువంటి యువతకు కమీషన్ ఇచ్చి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూపుల్లో ప్రచారం చేయిస్తున్నారు. ఇదంతా నిజమని భావించిన శివారు ప్రాంతానికి చెందిన యువకుడు 10 లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అత్యాశకు పోతే కష్టార్జితం ఆవిరే : చైనా కంపెనీలు బెట్టింగ్/గేమింగ్ యాప్‌లతో సొమ్మంతా కాజేస్తున్నాయి. క్రిప్టోగా మార్చి దుబాయ్, సింగపూర్, చైనా దేశాలకు హవాలా రూపంలో చేరవేస్తున్నారు. బ్యాంకులు, యూపీఐ లావాదేవీలున్న స్మార్ట్ ఫోన్ల పాస్‌వర్డ్, పిన్ నంబర్‌ను గోప్యంగా ఉంచుకోవాలి. తేలిక మార్గంలో డబ్బు సంపాదించ వచ్చనే అత్యాశకు పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సరదాగా మొదలెట్టి - వ్యసనంగా మార్చుకుని - ఆన్‌లైన్ గేమ్స్‌తో కోట్లలో అప్పులు - తీర్చలేక ఆత్మహత్యలు
మొదటిసారి త(అ)ప్పు చేస్తే నాన్న కాపాడాడు - ఈసారి మాత్రం కాపాడలేక 'పోయాడు'