Huge Traffic jam At Hyderabad Vijayawada Highway :రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్‌పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
10 టోల్‌బూత్‌లను విజయవాడవైపు తెరిచిన అధికారులు :విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. రద్దీనీ నియంత్రించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూత్‌లను విజయవాడ వైపు తెరిచారు.
4 సెకండ్లకు ఒక వాహనం చొప్పున : సాధారణ రోజుల్లో 35,000 నుంచి 45,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం శుక్రవారం ఒక్క రోజే 55 వేల వాహనాలు వెళ్లినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఈరోజు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్తుంది. నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం.