Tractor Accident In Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల వివరాల ప్రకారం, సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన 9 మంది కూలీలు ఈరోజు ఉదయం రేగడి మద్దికుంట గ్రామ శివారులో మొక్కజొన్న చేనులో పనికి వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, రాధమ్మ, వైష్ణవి అనే ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.