Tirumala Brahmotsavam 2024 : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత మాడవీధుల్లో విశ్వక్సేనులు వారు మాడవీధుల్లో విహరించారు. మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు.
తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు : తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ నెల 4 నుంచి 12 వరకూ జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 7లక్షల లడ్డూలు అదనంగా అందుబాటులో ఉంచారు. రేపు శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆ తర్వాత తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని శ్యామలరావు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు:
- అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు.
- అక్టోబర్ 5వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనంలో స్వామి వారు ఊరేగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు విహరిస్తారు.
- అక్టోబర్ 6వ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై కలియుగ నాధుడు విహరిస్తాడు.
- అక్టోబర్ 7వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు.
- అక్టోబర్ 8వ తేదీ మంగళవారం బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామి భక్తులను అలరిస్తాడు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సేవను చూడడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు.
- అక్టోబర్ 9వ తేదీ బుధవారం బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై వేంకటేశ్వరస్వామి ఊరేగుతాడు.
- అక్టోబర్ 10వ తేదీ గురువారం బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు.
- అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు.
- అక్టోబర్ 12వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
- బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు జరుగవు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది ఉండదు. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మోత్సవాలలో స్వామివారి దర్శనానికి వెళ్లాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు- తొలి రోజే పెద్దశేష వాహనంపై వెంకన్నను ఎందుకు ఊరేగిస్తారో తెలుసా? - Tirumala Brahmotsavam 2024
తిరుమల కొండ మీదే 9రోజులపాటు ముక్కోటి దేవతలు- ధ్వజారోహణ ఉత్సవ విశిష్టత ఇదే! - Tirumala Brahmotsavam 2024