Tips to save money when you have a low income :చిన్న పక్షి తన కుటుంబం కోసం ఒక్కొక్క పుల్లా చేర్చి చాలా రోజుల తర్వాత అది పెద్ద గూడు కట్టుకుంటుంది. ఆ పక్షికి తన గూడు కోసం తనకు ఎంత శక్తి ఉందో అంతలోనే చెట్టుపై రోజూ ఒక పుల్లను జమ చేసి పేర్చింది. అది చివరకు పెద్ద గూడులా మారింది. ఇలా తక్కువ ఆదాయం ఉన్నా, చిరుద్యోగమైనా ఎందుకు డబ్బులు కూడబెట్టలేకపోతున్నారు? మీకు మనసుంటే ఎన్నో మార్గాలున్నాయి.
జీతంలో కనీసం 10 శాతం : అధికాదాయం ఉంటేనే పొదుపు చేయగలమనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. అనవసర ఖర్చులకు కళ్లెం వేస్తే ఎంత సంపాదించినా ఆదా చేసేందుకు మార్గం ఉంటుంది. ముందు తక్కువ ఆదాయం వస్తోంది, పొదుపు చేయలేమనే ఆలోచనను మనసులోంచి తీసేయాలి. మీ జీతం ఎంతైనా సరే అందులో కనీసం 10 శాతం పక్కన పెట్టుకోవాలి. మీకు సేవింగ్స్ ఖాతా ఉన్నా సరే దాచాలనుకున్న డబ్బుకు విడిగా ఒక ఖాతా తీసుకొని మీ జీతం రాగానే పొదుపు మొత్తాన్ని అందులో వేస్తూ ఉండండి. ఇక పొదుపు మీ అలవాటుగా మారుతుంది.
మనసుంటే ఎన్నో మార్గాలు!
ఒక నెల ఖర్చులకు దూరం: ఏడాదిలో ఒక నెల పాటు నిత్యావసరాలు తప్ప మిగతా వేటికీ ఖర్చు పెట్టకండి. దీని వల్ల మీరు ఎటువంటి ఖర్చులను నియంత్రించుకోగలరో అర్థమవుతుంది.
ఎంత సంపాదనకు అంత ఇల్లు : మీ సంపాదనకు తగ్గ ఇంట్లోనే ఉండాలి. డాబులకు పోయి పెద్ద ఇంట్లోకి అద్దెకు దిగితే అది మీ ఆర్థిక లక్ష్యాన్ని దూరం చేస్తుంది.
దుస్తుల షాపింగ్‌లోనూ : చూసిన ప్రతిదాన్నీ కొనే అలవాటును ఇంపల్సివ్ బైయింగ్ అంటారు. చాలా మంది దుస్తులను ఇలా కొంటుంటారు. చిన్నవే కదా అనుకుంటే మాత్రం మీ జేబులు ఖాళీ అవుతాయి. వాటినీ అవసరమైన మేరకే కొనుగోలు చేయాలి.
కలిసి వంట చేస్తే :స్నేహితులతో, బంధువులతో కలిసి ఏ హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లారనుకోండి. చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే వారానికోసారి తలా ఒకరి ఇంట్లో కలవండి. వారితో కలిసి వంట చేసి చూడండి. వారితో బంధమూ బలపడుతుంది. డబ్బూలూ ఆదా అవుతాయి. భారీ ఖర్చులుండే మల్టీప్లెక్స్‌లకు, షాపింగ్‌మాల్స్‌లకు వెళ్లడం తగ్గించేయండి.
కారు అవసరమా? : మీకు అత్యంత అవసరమైతే తప్ప కారును తీసుకోవద్దు. ఎందుకంటే దాని నిర్వహణ కొన్నంత సులువు కాదు. పెట్రోలు, బీమా, మరమ్మతు ఖర్చులకు తోడు ఈఎమ్‌ఐ ఇలా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం కొద్ది రోజులు పరిశోధన చేయాలి. తద్వారా డీలర్, బీమా, బ్యాంకు రుణాల విషయంలో చాలా ఆదా చేసుకోవచ్చు.
పొదుపునకు గోల్డెన్ రూల్ : చాలా మంది ఆదాయం నుంచి ఖర్చులను తీసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. కానీ ఆదాయం నుంచి పొదుపును తీసేసి మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయడం సరైన విధానం. ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగిలిన మొత్తంతో ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులందరినీ పొదుపులో భాగం చేయాలి.
‘పొగ’ వద్దు: సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి మీ ఆరోగ్యానికి, జేబుకు హాని చేస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్, లాటరీ వంటివి మానసిక ఆరోగ్యానికీ ఇబ్బందే. వీటికి ఎంత దూరంగా ఉంటే మీ ఆర్థిక లక్ష్యాలకు అంత దగ్గరగా వెళ్లవచ్చని గుర్తుంచుకోండి.
షాపింగ్‌కు లిస్ట్ : ఏదైనా కొనాలి అనుకున్నపుడు ఇంట్లోనే జాబితా సిద్ధం చేసుకోవాలి. కూపన్లు ఉన్నాయి కదా అని కొనేయడం మంచిది కాదు. అలా 30 రోజుల పాటు అనవసర వస్తువులు, జంక్ ఫుడ్ కొనుగోళ్లు ఆపి చూడండి. ఎండా కాలంలో కావాల్సిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటివి చలికాలంలోనే కొనేయండి. అన్‌సీజన్ కాబట్టి అధిక డిస్కౌంట్లు ఉంటాయి. ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో డిస్కౌంట్లనూ ఉపయోగించుకోవచ్చు.
డూ ఇట్ యువర్ సెల్ఫ్: తక్కువ ఆదాయంతో కొన్ని పనులు స్వయంగా చేసుకోవడం నేర్చుకోవాల్సిందే. మనం చేయగలిగే చిన్న చిన్న పనుల కోసం ఇతరులపై ఆధారపడటం తగ్గించాలి. ఇంట్లో ఏదైనా వస్తువు మరమ్మతుకు గురైనపుడు కొత్తది కొనకుండా రిపేరు చేసుకోవడం గురించే తొలుత ఆలోచించాలి.
ఎంత దాచాలంటే?
- ప్రతి కుటుంబానికీ కొన్ని ఖర్చులు ఉంటాయి. వాటికోసం ముందుగా బడ్జెట్ వేసుకోవాలి. నిత్యావసరాలు, విద్యుత్తు, ఇంటి బిల్లులు, అద్దెలు ఇలా అన్నిటినీ ఒక బుక్కులో రాయండి.
- మీరు ఇతర సరదాల కోసం అయ్యే ఖర్చునూ లెక్క రాసుకోవాలి. ఇందుకు ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ బడ్జెట్ డ్యాష్ బోర్డులు, ఖర్చుల అంచనాలకు సంబంధించిన యాప్‌ల సహాయం తీసుకోవచ్చు.
- ఆ ఖర్చులకు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడని రీతిలో కత్తెర వేయండి. వాటిని పొదుపు ఖాతాలోకి మళ్లించండి.
రుణాల నిర్వహణ : క్రెడిట్ కార్డు రుణాలు, ఇతర అప్పుల వంటివి మీ ఆర్థిక లక్ష్యాలను చేరడానికి అడ్డంకులుగా మారతాయి. ఎందుకంటే వీటి వడ్డీ పెరుగుతూ పోతుంది. మీ బడ్జెట్‌లో కొంత భాగాన్ని ప్రతి నెలా ఉన్న అప్పులను కట్టుకోవడానికి పక్కనపెట్టాలి. అది కూడా అధిక వడ్డీ ఉండే వాటిని తొలుత చెల్లించాలి.
"స్వల్ప ఆదాయ కుటుంబాల్లో పొదుపు విషయంలో మహిళలది కీలక పాత్ర. ఆర్థిక స్వతంత్రతను పొందాలంటే ఆదాయాలు, వ్యయా లను అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైన ఇంటి బడ్జెట్‌ను రూపొందించడానికి వీలవుతుంది. తప్పక చేయాల్సిన ఖర్చులను లెక్కించాక పొదుపుపై దృష్టి సారించాలి. ఆ తర్వాతే ఇతర ఖర్చుల గురించి ఆలోచించాలి. అవసరాలకు, కోరికలకు మధ్య అంతరాన్ని గుర్తిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా సులువు. పొదుపును పెట్టుబడుల వైపు మళ్లిస్తే ఎక్కువ ప్రతిఫలాలు దక్కుతాయి. సిప్‌లు, పీపీఎఫ్‌లు వంటి వాటిలో చాలా తక్కువ మొత్తం కూడా పెట్టుబడిగా పెట్టవచ్చు."-స్వప్న కంతేటి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
పాత ఇళ్లతో ఏటా రూ.8.2 కోట్ల ఆదాయం- జపాన్ యువకుడి 'రియల్' స్ట్రాటజీ ఇదే!
హైదరాబాద్‌లో ట్రెండ్ మారుతోంది - ఒక్క ఏడాదే బైకులు, కార్ల రిజిస్ట్రేషన్‌కు రూ.300 కోట్లు!