Tight Security Arrangements At Yadadri Temple :తెలంగాణలో పేరొందిన యాదాద్రి(Yadadri) పుణ్యక్షేత్రంలో నిరంతర నిఘా కోసం పొలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా భక్తుల లగేజీ, బ్యాగుల నిశిత పరిశీలనకు స్కానర్, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా సామగ్రిని యాదాద్రి ఆలయానికి తీసుకొచ్చారు. త్వరలోనే వాటిని క్యూ కాంప్లెక్స్ ప్రవేశ మార్గం, లిఫ్ట్, తూర్పు, పడమటి ముఖంగా గల రాజగోపురాలతో పాటు శ్రీఘ్ర, బ్రేక్ దర్శన ప్రవేశ మార్గాల్లో వీటి డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు, క్యూ కాంప్లెక్స్ వద్ద లగేజీ స్కానర్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులు నిర్ణయించారు.
Yadadri Temple Security : రాష్ట్ర రాజధాని నగరానికి సమీపంలో గల ఈ పుణ్యక్షేత్ర సందర్శనకై వచ్చే భక్తులతో తెలంగాణ తిరుమలగా మారింది. ఈ నేపథ్యంలో తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులతో ఆలయ భద్రత, భక్తుల రక్షణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా రాచకొండ సీపీ డా.తరుణ్ జోషీ ఆలయ పరిసరాలను నిశితంగా పరిశీలించారు. నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాల వ్యవస్థ, ఎస్పీఎఫ్ సిబ్బందితో భద్రతా చర్యలను చేపట్టారు. భద్రతా తనిఖీల కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం డిటెక్టర్, స్కానర్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
Rush At Yadadri Temple :యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ వ్రత మండపం, కొండ కింది భాగంలో విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది.