Yuvraj Singh Father On Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని నిత్యం విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ తొలిసారి అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంఎస్ ధోనీ వైఖరి ధైర్యంగా ఉంటుదంని ప్రశంసించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ గురించి యోగ్రాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ధోని ఓ మోటివేటెడ్ కెప్టెన్. మైదానంలో సహచర ఆటగాళ్లకు ఎలా ఆడాలో మార్గనిర్దేశం చేస్తాడు. అతడిలో అత్యుత్తమమైన విషయం ఏంటంటే, బంతి ఎక్కడ వేయాలో బౌలర్లకు చెప్పగలడు. బ్యాటర్ మనసును చదవగలడు. అలాగే భయంలేని వ్యక్తి. మీకు గుర్తుందా, ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ జాన్సన్ బంతిని నేరుగా ధోనీ హెల్మెట్‌కు విసిరాడు. అయినా ధోనీ ఏ మాత్రం భయపడలేదు. ఆ తర్వాతి బంతినే సిక్స్‌గా మలిచాడు. అతడి లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు' అని యోగ్రాజ్ వ్యాఖ్యానించాడు.
Yograj Singh on MS Dhoni 🤯👀🔥.
— Jason𝕏 (@mahixcavi7) January 12, 2025
pic.twitter.com/cRYuPacBhE
గతంలో తీవ్ర విమర్శలు
తన కొడుకు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగియడానికి ధోనీనే కారణమని గతంలో విమర్శించాడు యోగ్రాజ్ సింగ్. ధోనీ, తన కుమారుడి కెరీర్ నాశనం చేశాడని ఆరోపించారు. అలాగే యువీ వేగంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పడానికి ధోనీనే కారణమని విమర్శించాడు. ఈ విషయంలో ధోనీపై చాలాసార్లు ఇలాంటి విమర్శలే చేశాడు.
'ఎప్పటికి క్షమించను'
ధోనీని ఎప్పటికీ తాను క్షమించనని యోగ్రాజ్ ఫైర్ అయ్యాడు. ధోనీ ప్రముఖ క్రికెటరే కానీ, తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు చేసిన అన్యాయం క్షమించరానిదని ఆరోపించాడు. ప్రతిదీ ఇప్పుడు వెలుగులోకి వస్తోందని మండిపడ్డారు. ధోనీ అద్దంలో తన ముఖం చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
'నేను జీవితంలో ఎప్పుడూ రెండు పనులు చేయలేదు. మొదటిది నాకు అన్యాయం చేసినవారిని ఎప్పుడూ క్షమించలేదు. అలాగే నా జీవితంలో పిల్లలు సహా కుటుంబ సభ్యులెవర్ని కౌగిలించుకోలేదు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ నాలుగైదేళ్లు టీమ్ఇండియా తరఫున ఆడగలిగేవాడు. కానీ ఎంఎస్ ధోనీ, ఆ తర్వాత కోహ్లీ యువీని భారత జట్టు నుంచి పక్కన పెట్టేశారు' అని యోగ్రాజ్ విమర్శించాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో మాత్రం యోగ్రాజ్ సింగ్ తన స్వరం మార్చాడు. ధోనీపై ప్రశంసలు కురిపించాడు.
'పదేళ్లుగా ధోనీతో మాటల్లేవ్- మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు!'