3 Weeks Study Plan For CAT Examination : క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)- 2024 దేశవ్యాప్తంగా 170 సిటీల్లో నవంబర్ 24న జరగబోతోంది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 21 ఐఐఎంలలో దాదాపు 5000 ఎంబీఏ సీట్ల కోసం, ఐఐటీలూ.. టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ ఎంట్రెన్స్ కోసం గ్రాడ్యుయేట్లకు క్యాట్ అర్హత తప్పనిసరి. ఎగ్జామ్ టైం దగ్గరపడుతుండటంతో తుది సన్నద్ధత చాలా కీలకం. ఈ కొద్దిరోజుల్లో వ్యూహాత్మకమైన కార్యాచరణను అనుసరిస్తే మంచి స్కోరు పొందవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం!
వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్లో విజయం కోసం రోజూ కనీసం ఒక సెక్షన్ మోడల్ టెస్ట్ రాయాలి. వారానికి కనీసం 20 రీడింగ్ కాంప్రహెన్షన్‌లు ప్రాక్టీస్ చెయ్యాలి. పరీక్ష తేదీలోపు 60 ప్యాసేజ్‌లు, వాటి సమగ్ర విశ్లేషణ చెయ్యాలి. క్యాట్‌లో ఈ సెక్షన్లో ఉన్న మొత్తం 4 ప్యాసేజీలను సమయ నిర్వహణ (టైం మేనేజ్మెంట్) దృష్ట్యా చెయ్యడం కష్టమే. అందువల్ల ఎవరికి వారు తమకు అనువైన 3 ప్యాసేజీలను ఎంచుకొని, వాటిని ప్రోపర్గా చెయ్యడమే మంచిది.
డేటా ఇంటర్‌ప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్‌లో మంచి స్కోరు సాధించాలంటే, ఫస్ట్ క్వాంట్ (అరిథ్‌మెటిక్ + మ్యాథ్స్) సబ్జెక్టుపై పట్టు బిగించాలి. రోజూ కాల్‌క్యులేషన్స్, కంపారిజన్స్, లాజికల్ డిడక్షన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. రోజులో కొన్ని లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రెటేషన్ సెట్స్ గత ఏడాది ప్రశ్నల సరళితో సాధన చేయడం అవసరం. మొదట్లో ఒక్కో సెట్‌కు ఎక్కువ టైం పడుతుంది. ప్రాథమిక దశలో దీని గురించి ఆలోచించకుండా కచ్చితత్వంపై గురి పెట్టి, తర్వాత దశలో స్పీడ్ గురించి ఆలోచించాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీలో అధిక భాగం ప్రశ్నలు అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రాల నుంచే వస్తున్నాయి. మొదటగా ఈ రెండు చాప్టర్లను కంప్లీట్ చెయ్యాలి. ఫార్ములాలను (సూత్రాలు) బట్టీ కొట్టకుండా లాజికల్ నాలెడ్జి ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు కనుగొనేలా సాధన చెయ్యాలి.
మొదటి వారం : బేసిక్స్ రివిజన్
ఈ వారం క్వాంటిటేటివ్ ఎబిలిటీలో అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, నంబర్ సిస్టమ్ వంటి చాఫ్టర్లలోని బేసిక్స్, ఫార్ములాలు, భావనలు కంప్లీట్ చెయ్యాలి. అలాగే డేటా ఇంటర్‌ప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్‌లో కూడా బేసిక్స్ రివిజన్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించాలి. రోజూ 30- 40 క్యాట్ నమూనా ప్రశ్నలు ప్రాక్టీస్ చేసి, పొరపాట్లు ఎక్కడ చేస్తున్నామో గమనించాలి. కచ్చితత్వాన్ని ముందుగా పెంచుకోవాలి. మూడు రకాలైన ప్రశ్నల్లో (సులభం- మధ్యరకం- కష్టతరమైనవి) రోజూ సాధన చెయ్యాలి. వారాంతంలో పని తీరును రివ్యూ చేసుకోవాలి. ఈ వారంలో సవాలుగా మారిన ప్రశ్నలపై మరొక్కసారి ఫోకస్ పెట్టాలి. మొదటి వారంలో వెర్బల్ ఎబిలిటీ- రీడింగ్ కాంప్రహెన్షన్‌ని కూడా మరవకుండా రోజుకు ఒక సెక్షన్ మోడల్ టెస్ట్ రాయాల్సిందే.