తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారం కొనుగోలు చేయాలా? - ఈ మోసాల బంగార్రాజుల మాయలో మాత్రం పడొద్దు! - PRECAUTIONS TO TAKE BUY GOLD

బంగారు ఆభరణాల కొనుగోలులో మోసపోతున్న మహిళలు, అమాయకులు - బీఐఎస్​ హాల్​మార్క్​ ఉన్న వాటినే కొనుగోలు చేయాలని సూచిస్తున్న అధికారులు

Precautions To Take Buy Gold
Precautions To Take Buy Gold (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 15 hours ago

Precautions To Take Buy Gold : ఏపీలోని కర్నూలుకు చెందిన ఓ మహిళ ఓ బంగారం దుకాణంలో రెండు తులాల గొలుసును కొనుగోలు చేశారు. ఇంటి అవసరాల కోసమని ఆమె భర్త బ్యాంకులో తనఖా పెట్టేందుకు వెళ్లారు. బ్యాంక్ అధికారులు హాల్‌మార్క్‌ సెంటర్‌కు ఆ పసిడి ఆభరణాన్ని పంపగా అందులో 70 శాతం బంగారం ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. రాగి 17 శాతం, వెండి 13 శాతం ఉన్నట్లుగా తేలడంతో వారు ఆశించినంతమేర లోన్​ ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. రసీదు లేకపోవటంతో బంగారు వ్యాపారిపై బాధితులు కంప్లైంట్ చేయలేకపోయారు.

పసిడి ఆభరణాల కొనుగోలులో ఎందరో మహిళలు, అమాయకులు మోసపోతున్నారు. పెద్దఎత్తున విలువైన సొమ్మును కోల్పోతున్నారు. అయినా తూనికలు, కొలతల శాఖ అధికారులు, కమర్షియల్​ ట్యాక్స్(వాణిజ్య పన్నుల శాఖ)​ వారు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా కొంతమంది బంగారం వ్యాపారులు వినియోగదారులను నిలువునా మోసగిస్తున్నారు. పసిడి ధర రోజురోజుకు పెరిగిపోతుండటంతో అంతేరీతిలో మోసాలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతవాసులు నిత్యం వంచనకు గురవుతున్నారు. ఇటు వినియోగదారులనేకాక అటు జీరో వ్యాపారంతో ట్యాక్స్ ఎగ్గొడుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు.

నిత్యం రూ.100 కోట్లకుపైగా వ్యాపారం :ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో చిన్న, పెద్ద గోల్డ్​ దుకాణాలు, షోరూంలు 800కుపైగా ఉన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే ప్రముఖ సంస్థల షాప్​లతో సహా దాదాపు 400 వరకు ఉన్నాయి. సగటున రోజూ దాదాపు 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. పసిడి ఆభరణాల విషయంలో షోరూంల నిర్వాహకులు కొంతవరకు నిబంధనలు పాటిస్తుండగా మధ్యతరహా గోల్డ్​ షాప్​ల నిర్వాహకులు కొందరు రూల్స్​ను పాటించడం లేదు.

గోల్డ్​ నాణ్యతను పరిశీలించే క్యారెక్టరైజేషన్‌ యంత్రం వాడటం లేదు. పసిడి ఆభరణం తయారు చేసేందుకు కొంత రాగిని కలుపుతారు. అయితే నాణ్యత తెలిపే హాల్‌మార్క్‌ విషయంలో కస్టమర్లను మోసగిస్తున్నారు. 22 క్యారెట్ల గోల్డ్​ ఆభరణమంటూ 18 క్యారెట్ల ఆభరణాన్ని కట్టబెడుతున్నారు. దీనిపై అవగాహన లేనటువంటి జనం పెద్దఎత్తున మోసపోతున్నారు. తూనికల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలివిగా రసీదులు(రిసిప్ట్​) ఇవ్వకుండా మామూలు కాగితాలపై రాసిస్తున్నారు. ఇటీవలే తూనికలు, కొలతల శాఖ అధికారులు కర్నూలులో పలు గోల్డ్​ షాప్​లను తనిఖీ చేసి 10 కేసులు నమోదు చేశారు.

హాల్‌మార్క్‌ తప్పనిసరి :పసిడి ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్క్‌ ద్వారా స్వచ్ఛత, నాణ్యత తెలుస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) రూల్స్​ మేరకు వ్యాపారులు హాల్‌మార్క్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. 24 క్యారెట్ల గోల్డ్​పై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లు-916, 21 క్యారెట్లు-875, 18 క్యారెట్లైతే 750 అనే ముద్ర ఉంటుంది. ఈ నంబరు తర్వాత హాల్‌మార్క్‌ వేసినటువంటి కేంద్రం గుర్తు, తయారైన సంవత్సరం, ఆంగ్ల అక్షరం కోడ్‌ ఉంటుంది. బీఐఎస్‌ ధ్రువీకరించిన బంగారు​ ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఒకవేళ హాల్‌మార్క్‌ లేనట్లయితే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

24 క్యారెట్ల గోల్డ్​లో ఇతర లోహాలేమీ ఉండవు 22 క్యారెట్ల పసిడి ఆభరణంలో రెండు వంతుల శాతం రాగి, జింక్‌ ఉంటుంది. 18 క్యారెట్లైతే 6 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. పసిడి శాతాన్ని టంచ్‌ మిషన్ల ద్వారా నిర్ధారిస్తారు. బీఐఎస్‌ అనుమతి పొందిన అనుమతిదారుడి వద్దే బంగారం శాతాన్ని నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. కానీ కొంతమంది ఎలాంటి అనుమతులు లేని టంచ్‌మిషన్‌ కలిగిన వారి వద్ద నిర్ధారణ చేస్తున్నారు. అధికారిక పత్రంపై కాకుండా సాధారణ కాగితంపై రాసి ఇస్తున్నారు. హాల్‌మార్క్‌ గుర్తును చూసిన తర్వాతనే ఆభరణాన్ని కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పలు మార్గాల్లో తరలిస్తూ :ఉమ్మడి కర్నూలు జిల్లాలో బంగారం అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోందని సమాచారం. పసిడిని దిగుమతి చేసుకునే వ్యాపారులు 3 శాతం జీఎస్‌టీ(గూడ్స్​ అండ్ సర్వీస్​ ట్యాక్స్), 12 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారస్తులు ఆయా పన్నులను ఎగవేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, రెండో ముంబయిగా పేరున్నటువంటి ఆదోని ప్రాంతాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది.

తమిళనాడు నుంచి హైదరాబాద్‌ నగరానికి కర్నూలు మీదుగా అధికంగా బంగారం అక్రమ రవాణా సాగుతోంది. గోల్డ్​ వర్తకులు తమకు నమ్మకమైన గుమస్తాల చేత ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తుంటారు. తమిళనాడులో తయారయ్యే పసిడి ఆభరణాలను చాలామంది వ్యాపారులు జీరో దందాపైనే ఉమ్మడి జిల్లాకు రవాణా చేస్తుండటం గమనార్హం.

ఎన్నికల సమయంలోనే హడావుడి :ఎన్నికల సమయంలో మాత్రమే చెక్‌పోస్టుల్లో తనిఖీలు నిర్వహించడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్ల బంగారం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల సమయంలో 785 గ్రాముల గోల్డ్​ను అధికారులు పట్టుకున్నారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ నుంచి కొయంబత్తూరుకు వెళ్లే బస్సును కృష్ణగిరి మండలం అమకతాడు వద్ద తనిఖీ చేయగా 4.2 కిలోల పసిడి ఆభరణాలు, 5 కిలోల వెండి బయటపడింది. గతంలో రూ.కోట్ల విలువ చేసేటువంటి వజ్రాభరణాలు పట్టుబడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి నిత్యం రూ.కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోంది.

ఏడువారాల నగలు అంటే ఏమిటి? అసలు ఎందుకు ధరిస్తారో తెలుసా? - yedu varala nagalu list

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details