The Wife Killed her Husbund : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి, పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సహకరించిన మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, 2011లో కీర్తీ, జగదీష్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. జగదీష్ బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బిజినపల్లి మండలంలో గుడ్లనర్వ గ్రామానికి చెందిన నాగరాజుతో కీర్తికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త తప్పుదారి పట్టి, వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంపై కీర్తి, జగదీష్‌ల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
హత మార్చాలనే ఆలోచన : కీర్తి ప్రియుడు నాగరాజుకు కూడా తన భార్యతో ఈ వివాహేతర సంబంధంపై గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలకు ముగింపు పలకాలని కీర్తి, నాగరాజులు నిర్ణయించుకున్నారు. కీర్తి భర్త జగదీష్‌ను హతమార్చితే తమ సంబంధానికి అడ్డు ఉండదని భావించారు. కీర్తి, నాగరాజు నవంబర్ 25వ తేదీన పథకం ప్రకారం మత్తు మందు కలిపిన మద్యాన్ని జగదీష్‌కు తాగించారు.