The Sleep Company Founder Priyanka Salot Yuva Story : పగలంతా పనిచేసి రాత్రి ఓ కునుకు తీస్తే కాస్త ఉపశమనంతో పాటు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మారుతున్న జీవన పరిణామాల దృష్ట్యా చాలా మంది బెడ్స్‌పై నిద్ర పోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దానినే తన వ్యాపారానికి ఆదరువుగా చేసుకుంది ఈ యువతి. మార్కెట్లో దొరికే వాటిలాగా కాకుండా భిన్నంగా పరుపులను తయారు చేస్తూ ఫోర్చూన్ ఇండియా 2022లో చోటు దక్కించుకుంది.
తను తయారు చేసిన ప్రొడక్ట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న ఈ యువతి పేరు ప్రియాంక సలోట్. ముంబయి స్వస్థలం. కలకత్తాలోని ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత పీ అండ్జీ అనే మార్కెటింగ్ సంస్థలో ఆరేళ్లపాటు ఉద్యోగం చేసింది. అయితే ఈమె గర్భిణీగా ఉన్న సమయంలో సరైన నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొంది. దానికి తోడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడింది. గర్భిణీగా ఉన్న సమయంలో సరైన పరుపు లేక ప్రియాంక సలోట్కి కంటి నిండా నిద్ర కరవైంది.
The Sleep Company Smart Ortho : ఈమెతో పాటు పుట్టిన పాపకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రకాల పరుపులు మార్చి నిద్రపోయినా ఈమెకు ఉపశమనం మాత్రం దొరకలేదు. దాంతో తానే స్వయంగా పరుపులు తయారు చేయాలని తలచింది. తాను పడ్డ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సౌకర్యవంతమైన పరుపులను తయారు చేయాలనుకుంది సలోట్. తన ఆలోచనను భర్తతో పంచుకుంది.
అతను సానూకూలంగా స్పందించడంతో డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న స్నేహితుడు త్రిపాఠి కలిసి మార్కెట్లో దొరికే పరుపులపై పరిశోధన చేసింది. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిద్రతో పాటు ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ద స్లీప్ కంపెనీ పేరుతో పరుపులను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రియాంక చెబుతోంది.
"నేను గర్భిణీగా ఉన్నప్పుడు, నాకు పాప పుట్టిన సమయంలో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. రాత్రి సమయంలో నిద్ర పట్టేది కాదు. అప్పుడు దేశంలో ఉన్న చాలా రకాల పరుపులను ఆర్డర్ చేశాను. కానీ ఏ పరుపు వల్ల నా వెన్నునొప్పి తగ్గకపోగా నిద్రకూడా వచ్చేది కాదు. ఆ సమయంలో నేను భారత్‌లో ఉన్న పరుపులను యూఎస్ఏ, యూరప్ వంటి దేశాల్లో వినియోగించే బెడ్స్‌తో పోల్చి చూశాను. ఆ సమయంలో డీఆర్డీవో శాస్త్రవేత్తగా ఉన్న నా మిత్రుడు త్రిపాఠి సాయంతో మనుషులు సరైన నిద్రపోవడంపై పరిశోధన చేశాము. మేము అనుకున్న టెక్నాలజీని రూపొందించడానికి సుమారు రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేశాము." - ప్రియాంక సలోట్, ద స్లీప్ కంపెనీ ఫౌండర్