Rashtrapati Bhavan Invitation For Sanitation Worker:పారిశుద్ధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు నగరపాలక సంస్థలో డ్రైనేజి శుభ్రం చేసే కార్మికురాలు జయమ్మ ఈ నెల 26న దిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. 15 సంవత్సరాలుగా ఆమె ఈ విభాగంలో పనిచేస్తూ పలు సేవలను అందిస్తున్నారు.
నేపథ్యం:నెల్లూరుకు చెందిన జయమ్మ గత 15ఏళ్లుగా భూగర్భ డ్రైనేజి కార్మికురాలిగా ఆమె పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే దీని ద్వారా వచ్చే వేతనం చాలకపోవడంతో సెప్టిక్ ట్యాంకులను సైతం శుభ్రం చేసుకునేవారు. శుభ్రం చేసే సమయంలో సెప్టిక్ ట్యాంకులో నుంచి విడుదల అయ్యే హానికర వాయువులను పీల్చుతూ తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. గోతుల్లో దుర్వాసనలతో ఈ వృత్తిని కొన్ని సంవత్సరాలు కొనసాగించారు.
క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent
గుర్తించిన కేంద్ర ప్రభుత్వం: మూడేళ్ల కిందట తనకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహనం మంజూరు చేయాలంటూ కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా ఎన్ఎస్కేఎఫ్ డీసీ పథకం కింద సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే మిషన్ వాహనం ఈమెకు అందజేశారు. స్వయం కృషితో విధులు నిర్వహించడంతో పాటు తోటి కార్మికులకు ఆదర్శంగా నిలవడంతో ఆమె సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దాంతో జయమ్మకు 32 లక్షల విలువైన వాహనాన్ని కేటాయించారు. పది లక్షలు రాయితీని సైతం కల్పించారు.
వాయిదాల పద్దతిలో ప్రతి నెల 27వేల రూపాయలు చొప్పున చెల్లించేలా జయమ్మ కుటుంబానికి అవకాశం కల్పించారు. భర్త రమేష్ వాహనానికి డ్రైవర్‌గా, జయమ్మ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా వాయిదా చెల్లిస్తూ వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని భర్తను వాహన డ్రైవర్ గా, ఇద్దరు పిల్లలను చదివిస్తూ జయమ్మ కుటుంబాన్ని ఆదర్శంగా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, పారిశుద్ధ్య విభాగంలో విశేష సేవలను అందిస్తున్న జయమ్మ కృషిని అధికారులు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జయమ్మ దంపతుల సేవలను గుర్తించిన రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం పంపారు. దీంతో జయమ్మ పనిచేస్తోన్న నగరపాలక సంస్థలో సందడి నెలకొంది.
''గత 15 ఏళ్లుగా నేను భూగర్భ డ్రైనేజి కార్మికురాలిగా పని చేస్తున్నాను. నాతో పాటు ఎంతో మంది కార్మికులు విధులను నిర్వర్తిస్తారు. మా సేవలను గుర్తించి వారందరి తరపున నాకు ఈ అవకాశాన్ని కల్పించడం నాకు చాలా గర్వ కారణంగా ఉంది. రాష్ట్రపతి భవన్లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాకు ఆహ్వానం వచ్చిన తరువాత నా ఆనందానికి అవధులు లేవు. నా ఈ విజయంలో నా భర్త రమేశ్ పాత్ర కూడా ఎంతో ఉంది''-వనపర్తి జయమ్మ,పారిశుద్ధ్య కార్మికురాలు,నెల్లూరు నగరపాలక సంస్థ
Success Story : ఫ్రూటీ బిజినెస్‌ను రూ.8 వేల కోట్లకు పెంచిన యంగ్ లేడీ.. ఆమె విజయ సూత్రమిదే!
రిలయన్స్‌లో ముకేశ్ అంబానీ కంటే.. అత్యధిక వేతనం పొందే వ్యక్తి మీకు తెలుసా?