Lorry catches Fire At petrol Bunk : డీజిల్ కోసమని పెట్రోల్ బంక్‌కు వచ్చిన లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో లారీ ట్యాంక్ నుంచి మంటలు వచ్చాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేంతలోపే లారీ ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభించాయి. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా పెట్రోల్‌బంకు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే తేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరి పట్టణంలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాద వివరాలిలా :పెట్రోల్ బంకు సిబ్బంది వివరాల ప్రకారం భువనగిరి పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్దకు డీజిల్ ఫిల్ చేయించడానికని ఓ లారీ వచ్చింది. అయితే వచ్చిన కాసేపట్లోనే లారీ అయిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాల ద్వారా మంటలను ఆర్పివేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఊహించని పరిణమానికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటలు చల్లార్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన భారీ ప్రమాదం జరిగి ఉండేది.