Attacks on RTC Employees : మద్యం తాగి ఓ వ్యక్తి ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్, మహిళా కండక్టర్‌లపై దాడికి దిగాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని జరుగుమిల్లి మండలం కామేపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన కథనం ప్రకారం, ఒంగోలు నుంచి జరుగుమల్లి మండలం వర్థినేనిపాలేనికి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. టంగుటూరు, జరుగుమల్లి మార్గంలో కామేపల్లి విగ్రహాల కూడలికి చేరుకోగానే ప్రయాణికులు బస్సు దిగుతున్నారు.
ఈ క్రమంలో కామేపల్లికి చెందిన పత్తిపాటి హరి బాబు అనే వ్యక్తి అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్నాడు. తాగిన మైకంలో రోడ్డుపై పలువురితో గొడవ చేస్తున్నాడు. అదే సమయంలో ప్రయాణికులు దిగిడానికి డ్రైవర్ బస్సు ఆపాడు. ప్రయాణికులు దిగిన తర్వాత కండక్టర్ సుభాషిణి డ్రైవర్‌కు రైట్ చెప్పింది.
భౌతిక దాడి : ఈ క్రమంలో హరిబాబు ఆర్టీసీ బస్సు సమీపానికి వచ్చి నిల్చున్నాడు. పక్కకు వెళ్లాలని కండక్టర్ సుభాషిణి సూచించింది. ఇంతలోనే కండక్టర్‌ను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. అనంతరం బస్సు టైర్ కింద పడుకొని ముందుకు కదలకుండా నానా హంగామా చేశాడు. సుభాషిణిని బస్సు చుట్టూ వెంబడిస్తూ కొట్టాడు.