MLC Elections Vote Registration : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు నమోదు దరఖాస్తు ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
గతంలో ఓటు ఉన్న వారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయాలంటే మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల ముసాయిదా జాబితా ఈనెల 23న ప్రచురించనున్నట్లు తెలిపింది. దానిపై డిసెంబరు 9 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను డిసెంబరు 30న విడుదల చేయనుంది.
ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు : వచ్చే ఏడాది మార్చి 29 తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డిల పదవీకాలం ముగియనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు టికెట్ కావాలని పలుమార్లు పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పడేందుకు ప్రస్తుతం ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి మరి పోటీ పడేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.