Leopard Died in Hunters Trap in AP: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కి మగ చిరుత (4-5 ఏళ్లు) బలైంది. చిరుత కాలి గోళ్ల కోసం పాదాలు నరికేసి, అతి భయంకరంగా నోటిని చీల్చి మరీ అన్ని పళ్లు పట్టుకెళ్లారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా తాళ్లమడుగు సమీపంలోని బోడబండ్ల బీట్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం స్థానికంగా పశువుల కాపరి చిరుత కళేబరాన్ని గుర్తించి గ్రామస్థులందరికీ చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వారి సమాచారం మేరకు డీఎఫ్‌వో (డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్) భరణి ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎస్వీ జూ పశు వైద్యాధికారులతో పోస్టుమార్టం నిర్వహించగా, శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కరెంటు తీగలు ఏర్పాటు చేసి చిరుతను హత్య చేసి ఉండవచ్చని డీఎఫ్‌వో భరణి అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ తీగలు ఎక్కడివి?:సోమల మండలంలోని ఆవులపల్లె అటవీ పరిధి గట్టువారిపల్లె సమీపంలోని చెరువుకోన అటవీ ప్రాంతంలోని లోయలోనూ మరో చిరుత కళేబరం వెలుగు చూసింది. జిల్లాలో రెండు పులులు మృత్యువాతపడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. డీఎఫ్‌వో భరణి, ఎఫ్‌ఆర్వో శ్రీరాములు ఘటనా స్థలం పరిశీలించారు. పశు సంవర్ధక ఏడీ శ్రీనివాసులు నాయుడు, పశు వైద్యాధికారి చందన ప్రియ, తిరుపతి జూపార్క్ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. చిరుత వేటగాళ్ల ఉచ్చులో పడిందా? విద్యుత్తు తీగలు తగలి మృత్యువాత పడిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.