Central Govt Financial Helps To Telugu States :వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి రూ.3,448 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. తక్షణ సాయం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రల పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, ప్రకటించిన ఆర్థిక సాయాన్ని త్వరగా అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
వరద నష్టంపై కేంద్రమంత్రికి వివరణ : రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌ను కోరారు. భారీ వర్షాలతో సుమారు రూ. 5 వేల 438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం తెలిపారు. సచివాలయంలో కేంద్రమంత్రికి వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు.
రెండు రాష్ట్రాలను ఒకేలా చూడాలి :ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం రేవంత్ కోరారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్రమంత్రికి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు.