Cabinet Sub Committee Meet on Ration Cards :రాష్ట్రంలో నూతన తెల్లరేషన్ కార్డులు పొందేందుకు అర్హతలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమై రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధివిధానాలపై చర్చించారు. ఇప్పటికే ఉన్న వారితో పాటు, అర్హులకు కొత్తగా తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూపరిమితిపై చర్చ :తెల్లరేషన్ కార్డుల జారీకి గరిష్ఠ వార్షికాదాయం, భూమి పరిమితిపై పౌర సరఫరాలశాఖ ప్రతిపాదనలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల గరిష్ఠ వార్షికాదాయంగా ప్రతిపాదించింది. గ్రామాల్లో మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల చెలకగా గరిష్ట భూపరిమితిగా ప్రతిపాదించిన పౌరసరఫరాల శాఖ, పట్టణాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయన్ని మాత్రమే పరిగణనలో తీసుకోవాలని పేర్కొంది.
అర్హులందరికీ కార్డులు :అర్హతలు, విధివిధానాలపై అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి, ఏదో ఒక చోట ఉండేలా నిర్ణయించుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా లోతైన అధ్యయనం చేస్తామన్నారు.