Telangana Group 2 Exam Dates : రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 15,16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన సమగ్ర టైం టేబుల్, సూచనలతో కూడిన వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. ప్రతి పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 150 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షల తేదీ, సమయం :డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్ 3,4 నిర్వహించనున్నారు.
పరీక్ష రాసే అభ్యర్థులకు నియమ- నిబంధనలు :
- పరీక్ష ప్రారంభం అయ్యే సమయం కంటే అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
- ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం 9.30 గంటలు తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు 2.30 గంటల తరవాత అభ్యర్థులెవరనీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తారు.
- ఈ మేరకు ఓ నమూనా ఓఎంఆర్ షీట్లు, సూచనలు వెబ్సైట్లలో పొందుపరిచారు.
- పేపర్-1 పరీక్ష రాసిన హాల్ టికెట్‌తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలి.
- హాల్ టికెట్, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరచుకోవాలి. వాటిని అడిగినప్పుడు సమర్పించాలి.
- అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో సమాధానాలు తప్పులు లేకుండా రాయాలి.
- హాల్‌టికెట్లు డిసెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- తర్వాత ఎటువంటి డూప్లికేట్ హాల్‌టికెట్లు జారీ చేయరు.