Telangana Police Arrested Police Department Apps Hacker : ఓ వ్యక్తి ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు యాప్‌లను హ్యాక్ చేసి అందులోని డేటాను టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేసింది. హ్యాకర్ దిల్లీలోని ఉంటున్న విద్యార్థి జతిన్కుమార్గా గుర్తించారు. శనివారం అక్కడకు వెళ్లి అరెస్టు చేసిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినా చివరికి టెక్నాలజీ సాయంతో అధికారులు చాకచక్యంగా అరెస్టు చేశారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం :తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హ్యాక్ ఐ యాప్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి హ్యాక్ చేసినట్లు టీజీసీఎస్బీ ఇటీవల ఓ కేసును నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తెలంగాణ పోలీసు శాఖకు చెందిన టీఎస్ కాప్ యాప్, ఎస్ఎంఎస్ సర్వీసెస్‌లోని డేటాను కూడా హ్యాకింగ్ చేసి చోరీ చేశాడు. ఈ మొత్తం డేటాను 150 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తానంటూ అంతర్జాలంలో పోలీసులకు ఓ లింక్ కనిపించింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి హ్యాకర్‌ను పట్టుకునేందుకు శ్రమించారు.
పోలీసుల డేటాను కొనుగోలు చేయదలిచినవారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్ రెండు టెలిగ్రామ్ ఐడీలను నెట్టింట పొందుపరిచాడు. ఆ వ్యక్తిని గుర్తించకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఇక్కడే టీజీసీఎస్బీ పోలీసులు చాకచక్యంగా సోషల్ ఇంజినీరింగ్ విధానాన్ని వినియోగించి హ్యాకర్ జతిన్ కుమార్ దిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దిల్లీ వెళ్లి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరానికి చెందినవాడు. ముందుగా అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం ట్రాన్సిట్ రిమాండుపై హైదరాబాద్ తీసుకువచ్చారు.