TG Vehicle Registration in Telangana 2024 : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై టీజీ పేరిట చేయాలని మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతేడాది నవంబర్ 30 నాటికి రవాణా శాఖలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 1,60,81,666 ఉన్నాయి. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని టీజీగానే సంబోధించే వాళ్లమని వివిధ మోటారు వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. తమ వాహనాలకు టీజీ అని రాసుకునే వాళ్లం అని అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నారు.
TG Registration For New Vehicles :ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ క్యాబ్ అసోసియేషన్ నాయకులు, ఆటో యూనియన్ అసోసియేషన్ నేతలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వాహనాలకు టీఎస్ స్థానంలో టీజీ పేరితో రిజిస్ట్రేషన్ (Vehicle Registration) చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోటారు వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఇబ్బందేమి లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
పాత వాహనాలకు కూడా టీఎస్‌ను తొలగించి టీజీ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆర్థికంగా భారం పడుతుందని మోటారు వాహనాల యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లు ఉండే అవకాశం ఉంటుందని అదొక సమస్యగా మారుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ద్విచక్ర వాహనదారులకు, ఆటోవాలాలకు, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భారం పడుతుందని మోటార్ వాహన యూనియన్ నేతలు వెల్లడించారు.
నూతన వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్లు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పాత వాహనాలను టీజీ పేరు మీద మార్చాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకవేళ అందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ఇప్పటికే ట్యాక్స్‌లు పెరిగాయి. గత ప్రభుత్వంలో ట్యాక్స్‌లు పెంచారు. వాటిని కట్టలేక పోతున్నాం. ఈ ప్రభుత్వమైనా వాటినా తగ్గించాలని కోరుతున్నాం. -గోపాల్‌రెడ్డి, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నేత