TS to TG Registrations from Today : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి వాహనాల నంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ బుద్ద ప్రకాష్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో(RTA Office) టీఎస్ నుంచి టీజీగా మారిన వాహనాల నంబర్ల ప్లేట్లను, రిజిస్ట్రేషన్ పేపర్లను వాహనదారులకు రవాణాశాఖ అధికారులు అందజేశారు.
TG Registrations for New Vehicles : తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నంబర్ ప్లేట్లను ఏపీ నుంచి టీజీగా అతికించామని అది ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు చెప్పుకున్నామని బుద్ద ప్రకాష్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వాహనాలు అన్నింటికి టీజీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఏ వాహనం అయినా రిజర్వేషన్ చేసుకున్న 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీఎస్ నంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలను టీజీగా మార్చే అవకాశం లేదని రవాణాశాఖ స్పష్టం చేసింది.
చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేన్నందున టీఎస్ వాహనాలు టీఎస్ పేరుతోనే కొనసాగుతాయి. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రవాణాశాఖ స్పష్టం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 70,68,252 వరకు ఉన్నాయి. టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 92,82,903 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు 1,63,51,155 వరకు ఉన్నాయి.