TG Registration for New Vehicles in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్కులో మార్పు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాహనాల నంబర్ ప్లేట్లలో టీఎస్ స్థానంలో టీజీని మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈనెల 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వెహికల్ యాక్ట్-1988లోని సెక్షన్ 41 (6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం(Central Govt) మార్పు చేసింది. గత ప్రకటనలోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణకు ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ మార్క్ కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది.
Vehicle Registration For Telangana :రాష్ట్రంలో మొత్తం కోటీ 60లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో కోటీ 18లక్షల ద్విచక్రవాహనాలు, 21లక్షల 32వేల కార్లు, 7,27,000 ట్రాక్టర్లు-ట్రైలర్లు, 6,18,000 రవాణా వాహనాలు తదితరాలు ఉన్నాయి. ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు(Transport Officials) తెలిపారు. ఏపీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు రాష్ట్రంలో ఇంకా భారీ సంఖ్యలోనే తిరుగుతున్నాయి.
టీఎస్ నుంచి టీజీకి వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు - నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం