Better Medical Services At Nizamabad Govt Hospital :నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అత్యుత్తమ సేవలతో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా నిలుస్తోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ చొరవతో సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అరుదైన అపరేషన్లు నిర్వహించడంతో పాటు కష్టతరమైన సేవలు అందిస్తూ ఆసుపత్రి పలువురి ప్రశంసలు అందుకుంది.
అధిక వ్యయానికి అయ్యే వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే పలు విభాగాల్లో సేవలు ప్రారంభించగా మరిన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Super Specialty Services :ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. మూడు నెలలుగా రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే న్యూరాలజీని కూడా నిజామాబాద్‌లోనూ ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికీ చికిత్స అందిస్తున్నారు.
నేడు కార్పొరేట్ ఆస్పతుల్లో రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చయ్యే సేవలను ఉచితంగా అందించి ఎందరికో ఆర్థిక భారం లేకుండా చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి సూపర్ స్పషాలిటీ హోదా లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకుని పేదల కోసం ఈ సేవలు తీసుకొస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.