TG govt On Landless Poor Families :భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సహాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా, కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. దీంట్లో పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భూమి లేని నిరుపేదలకు నగదు :తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా, వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు పోతున్నట్లు కార్డులు చలామణిలో ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంచవచ్చని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. వీరికి రూ.6 వేల చొప్పున ఇవ్వడానికి దాదాపు రూ.1000 కోట్ల వరకూ అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.
అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నది కసరత్తు పూర్తయితే గానీ తెలీదు. ఈ పథకంతో ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతలుగా రూ.12 వేలు వస్తాయని, అందులో తొలి విడతగా రూ.6 వేలను ఈ నెల 28న విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.
రైతు భరోసా పథకానికీ నిధుల సమీకరణ : దీంతో పాటు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 14న సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు తెలిపారు. దీనికి అర్హులైన రైతులను గుర్తించడానికి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు అనర్హులను తొలగించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పంట సాగుచేయని భూముల యజమానులకు రూ.21 వేల కోట్లకు పైగా ఇచ్చారని, కానీ ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగుచేసే నిజమైన రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కొండలు, గుట్టలు, రహదారులకు కూడా పట్టాదారు పాసుపుస్తకాలు ఉండటంతో వాటిని గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది.