ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్‌ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!

TET Notification Released in AP: జగన్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ ప్రకటించిందని ఇప్పటికే నిరుద్యోగులు, విపక్షాలు ఆందోళన చేయగా.. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన టెట్‌ ప్రకటనలో నెలకొన్న గందరగోళంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

TET_Notification_Released_in_AP
TET_Notification_Released_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 11:22 AM IST

Updated : Feb 9, 2024, 11:44 AM IST

TET Notification Released in AP: బీఈడీ చేసిన వారికి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్‌ పేపర్‌-1కు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఈడీ అర్హత ఉన్న వారు ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ రెండు పోస్టులకూ అర్హులేనని స్పష్టం చేసింది.

అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్‌ రాష్ట్రం కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడీ వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డీఎస్సీ-2018లో నిబంధనలనే ఈసారీ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

టెట్‌ పరీక్ష విధివిధానాలను ఓ సారి పరిశీలిస్తే టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మైనస్‌ మార్కులు ఉండవు. 1 నుంచి 5 తరగతులకు నిర్వహించే పేపర్‌-1లో ఆంగ్ల భాషకు 30 మార్కులు పెట్టారు. ఓసీ అభ్యర్థులు 60శాతం, బీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన

టెట్‌ అర్హత జీవిత కాలం ఉంటుంది. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. పేపర్‌కు దరఖాస్తు ఫీజును 750రూపాయిలుగా నిర్ణయించారు. గతంలో ఈ ఫీజు ఐదు వందల రూపాయలు ఉండేది. దరఖాస్తు నింపడంలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు. మళ్లీ కొత్తగా ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా 24 జిల్లాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

టెట్‌పరీక్ష అర్హత విషయంలో అయోమయం నెలకొంది. 1 నుంచి 5 తరగతుల్లో బోధనకు ఎస్జీటీ పోస్టులకు నిర్వహించే టెట్‌ పేపర్‌-1(ఎ)కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం మార్కులతోపాటు బీఈడీ ఉండాలనే నిబంధన విధించారు. అదే 6నుంచి 8 తరగతులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్‌-2(ఎ)కు మాత్రం డిగ్రీలో 40 శాతం ఉన్నా అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది.

ఎస్జీటీ పోస్టులకు డిగ్రీతో బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించింది. అలాంటప్పుడు రెండు పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కులు పెట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిర్ణయించింది. డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు బీఈడీలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇలా బీఈడీ చేసిన వారు ఎస్జీటీ టీచర్‌ టెట్‌కు అర్హత కోల్పోనున్నారు.

మరోవైపు టెట్‌ పరీక్షకు బండెడు సిలబస్‌ను పూర్తి చేయడం అభ్యర్థులకు సవాలుగా మారింది. స్కూల్‌ అసిస్టెంట్‌ పేపర్‌-2ఏకు 6నుంచి 10 తరగతుల పాత పుస్తకాలతోపాటు 6నుంచి9 తరగతుల కొత్త పుస్తకాల సిలబస్‌ను చదవాలని ప్రభుత్వం పేర్కొంది. 1నుంచి 5 తరగతులకు సంబంధించి 3నుంచి 5 తరగతుల ప్రస్తుత సిలబస్‌ చదవాల్సి ఉంటుంది.

వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోంది: అచ్చెన్నాయుడు

పాఠశాల విద్యాశాఖ రెండు పర్యాయాలు సిలబస్, పాఠ్య పుస్తకాలను మార్చింది. మొదట రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లోని కొంత సిలబస్‌ను మార్చింది. ఆ తర్వాత సీబీఎస్​ఈకి వెళ్తున్నట్లు ప్రకటించి ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పూర్తిగా సీబీఎస్​ఈ సిలబస్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం పదో తరగతికి రాష్ట్ర సిలబసే ఉంది. 3నుంచి 5 తరగతుల్లోనూ సీబీఎస్​ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టింది.

టెట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పాత సిలబస్‌తోపాటు ఇప్పుడు మార్పు చేసిన సిలబస్‌ను చదవాల్సిరావడం భారంగా మారనుంది. ప్రభుత్వం కేవలం 20 రోజుల సమయమే ఇచ్చింది. ఇంత తక్కువలో సన్నద్ధత ఎలా సాధ్యమని కొందరు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టెట్‌ పరీక్షల షెడ్యూల్‌కి సంబంధించి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.

పేపర్‌-1(ఎ), పేపర్‌-2(ఎ)ను రోజుకు రెండు విడతలుగా ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్‌-1(బి), పేపర్‌-2(బి)ని ఉదయం ఒక్క సెషన్‌లోనే నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షల అర్హతలకు సంబంధించి ఎస్జీటీలకు టెట్‌ పేపర్‌-1(ఎ) నిర్వహించనున్నారు. ఈ పేపర్‌ రాసేవారు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతోపాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ విద్య, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిగ్రీలో 50 శాతం మార్కులతో బీఈడీ, పీజీలో 50 శాతం మార్కులు లేదా తత్సమాన అర్హతతో మూడేళ్ల బీఈడీ, ఎంఈడీ చేసి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అర్హత మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. పేపర్‌-1(బి)ని ప్రత్యేక పాఠశాలల్లో 1నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించనున్నారు. పేపర్‌-2(ఎ)ను స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులతో బీఈడీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులతో పాటు మూడేళ్ల బీఈడీ, ఎంఈడీ ఉన్న వారు సైతం అర్హులే. పేపర్‌-2(బి)ని 6 నుంచి 10 తరగతులకు ప్రత్యేక పాఠశాలల్లో బోధన కోసం నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీ మార్కుల్లో 10 శాతం మినహాయింపునిచ్చారు. ఇది ఈ ఒక్కసారికేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డీఎస్సీ పోస్టులను 23వేలకు పెంచాలి- పోలీసుల సహయంతో నిరుద్యోగుల పోరాటాన్ని ఆపలేరు: ఏఐఎస్ఎఫ్

గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్‌ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!
Last Updated : Feb 9, 2024, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details