Tension Situations in Punganur :ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాఖాలో విపక్షాలపై అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలు శ్రుతిమించుతున్నాయి. తాము తప్ప మరే పార్టీ నేతలూ పుంగనూరు నియోజకవర్గంలో ఉండకూడదన్న రీతిలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే దౌర్జన్యాలు సాధారణమన్న స్థాయికి పుంగనూరు పరిస్థితులు దిగజారాయి.
అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో నెంబర్‌టూగా వ్యవహరిస్తూ చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల పాటు ఆధిపత్యాన్ని చెలాయించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధారణ ఎన్నికల్లోనూ అదే తరహా పోకడలకు తెరతీస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు సాగిస్తున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సమయంలో ఆయనపై దాడులకు పురికొల్పారు. వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులకు దిగితే తిరిగి టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పుంగనూరులో మంత్రి దౌర్జన్యాలు తీవ్రమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలను నిర్బంధించి తమకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బందులు తప్పవంటూ దాడులకు దిగడంతో పాటు వారిపైనే ఎదురు కేసులు పెడుతున్నారు.
Election Campaign in Andhra pradesh : ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమ ఆధిపత్యం ఉన్న పుంగనూరు పట్టణం, పుంగనూరు గ్రామీణం, సదుం మండలాల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఆదరణ లభిస్తుండటం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చల్లా రామచంద్రారెడ్డికి అండగా నిలుస్తున్న వారిని నిరోధించడం ద్వారా తమ ఆధిపత్యానికి అడ్డులేకుండా చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.