OU JAC Attack On Allu Arjun House : ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్‌లోని మొక్కలు ధ్వంసమయ్యాయి.
విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న ఆయన మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. జరిగిన రాళ్ల దాడిపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.