Telangana University Problems : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు నానాటికీ అధికమవుతున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం లోపించి దోమలు, పాములతో సహవాసం చేయాల్సిన దుస్థితి యూనివర్సిటీలో నెలకొంది.
వర్షం పడితే గదులన్నీ జలమయం : వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. హాస్టల్‌లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గదులన్నీ జలమయం అవుతున్నాయి. దాంతో దోమల సమస్య పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుందని చెబుతున్నారు. సమస్యలపై వర్సిటీ అధికారులకు విన్నవిస్తే రెగ్యులర్ వీసీ లేరనే సాకు చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం సైతం అందక అవస్థలు పడుతున్నారు. నెల క్రితం అల్పాహారంలో బల్లి రాగా, ఇటీవల సాంబార్‌లో పురుగు ప్రత్యక్షమైంది. దాంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. అయినా తీరు మారలేదని, భోజనంలో తరచూ పురుగులు, బల్లులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు గోడు వెల్లబోస్తున్నారు.