School Children Safety on Roads : బడికి వెళ్లే బస్సు, దిగే క్రమంలో రోడ్లు దాటే సమయంలో, సైకిళ్లపై, నడుచుకుంటూ వెళ్లేటప్పుడు, ఇతర వాహనాల్లో వెళ్తున్న సమయంలో విద్యార్థులు ప్రమాదబారిన పడుతున్నారు. బడిలో పాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వారు ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఏటా ఇలాంటి ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తుండగా, వేల సంఖ్యలో గాయపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2023లో 18 ఏళ్లలోపు పిల్లలు 300 మంది మరణించారు. అలాగే 1,175 మంది గాయపడ్డారు. ఇందులో 18-25లోపు వారు 1,115 మంది మరణించగా, 3,564 మంది గాయపడ్డారు. ఏకంగా 2023లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 7,600 మంది మరణిస్తే అందులో 1,415(18.61శాతం) పాతికేళ్ల లోపువారే ఉన్నారు. వీరిలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారే ఎక్కువగా ఉంటారని అధికారులు చెబుతున్నారు.
విద్యాసంస్థల బయట 35 వేల ప్రమాదాలు :
- ప్రపంచంలోనే భారతదేశం రోడ్డు ప్రమాద మరణాల్లో అధికం. రోజూ దాదాపు 400 మంది మరణిస్తున్నారు.
- ప్రపంచంలోనే మొత్తం వాహనాల్లో దేశంలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే. కానీ రహదారి ప్రమాద మరణాల్లో మన వాటా 11 శాతం.
- దేశంలో రహదారి ప్రమాద్లో నిత్యం సగటున 42 మంది చిన్నారులు మరణిస్తున్నారు.
- 31 మంది 18,25 యువతీయువకులు చనిపోతున్నారు.
- 2023లో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బయట 35 వేల ప్రమాదాలు జరిగాయి. అందులో 10 వేల మంది పిల్లలు మరణించారు.
- రహదారి ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో తొలి 10 స్థానాల్లో ఉండగా, 2023లో 21,619 రహదారి ప్రమాదాలు జరిగాయి.
30 జిల్లాల్లోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్ పార్కులు : రహదారుల ప్రమాదాలను నియంత్రించడానికి ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలి దశలో 30 జిల్లాల్లోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జిల్లాల వారీగా పాఠశాలల్ని గుర్తించి, వాటిలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేసి రహదారి భద్రతా పాఠాల్ని విద్యార్థులకు నేర్పించనున్నారు.