Minister Ponnam about Sarathi Vahan Portal : కేంద్ర మోటారు వాహన చట్టంలో భాగంగా సారథి.వాహన్ పోర్టల్‌లో తెలంగాణ రవాణాశాఖ చేరాలని నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ చెకింగ్ కోసం దాదాపు 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాహనాల స్క్రాపింగ్ పాలసీని కూడా అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితితో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటికే 28 రాష్ట్రాలు సారథి.వాహన్ పోర్టల్ అమలు చేస్తున్నాయని, తెలంగాణలోనూ అమలు చేయబోతున్నామని మంత్రి పొన్నం ప్రకటించారు.
15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కు తుక్కే! - సారథి.వాహన్ పోర్టల్‌లోకి తెలంగాణ - TELANGANA IN SARATHI VAHAN PORTAL
సారథి.వాహన్ పోర్టల్‌లో తెలంగాణ రవాణాశాఖ - వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ - 15 ఏళ్లు దాటిన వాహనాలకు తుక్కు విధానం అమలు - రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు
Published : Oct 9, 2024, 12:25 PM IST
కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున, హైదరాబాద్‌లో అదనంగా 4 కలిపి మొత్తం 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం వివరించారు. ఒక్కో సెంటర్‌కు రూ.8 కోట్ల చొప్పున రూ.296 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. 15 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు, 8 సంవత్సరాలు పైబడిన రవాణా వాహనాలకు తుక్కు విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. నిబంధనలు ఉల్లంఘించిన 8 వేల మంది లైసెన్సులను ఇప్పటికే రద్దు చేశామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై యూనిసెఫ్ సహకారం సైతం తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా 113 మంది వెహికల్ ఇన్‌స్పెక్టర్లు విధుల్లోకి రాబోతున్నారని తెలిపారు.
15 ఏళ్లు దాటిన వాహనాలకు తుక్కు విధానం : వాలంటరీ వెహికల్ పాలసీ వ్యక్తిగత వాహనం 15 సంవత్సరాలు దాటిన తర్వాత స్వచ్ఛందంగా తుక్కుగా రిజిస్ట్రేషన్ చేయించినవారు తర్వాత రెండేళ్లల్లో కొత్త వాహనం కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్‌లో తగ్గింపు ఉంటుందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు తుక్కుకు పంపించకుండా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదనంగా పన్ను కట్టాల్సిదేనని స్పష్టం చేశారు.