తెలంగాణ

telangana

ETV Bharat / state

హైడ్రా ఆర్డినెన్స్​కు రాష్ట్ర గవర్నర్​ ఆమోదం - గెజిట్​ రిలీజ్​ - GOVERNOR APPROVED HYDRA ORDINANCE - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్సు - జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్​

Governor approved ordinance Hydra
Governor approved ordinance Hydra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 4:43 PM IST

Updated : Oct 5, 2024, 5:39 PM IST

Raj Bhavan Approves Hydra Ordinance : రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 (బి) సెక్షన్​ను చేర్చినట్లు గెజిట్​లో పేర్కొంది. ఆ సెక్షన్ ద్వారా హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది.

హైదరాబాద్ మహానగరం భౌగోళికంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉండటం, జీవనోపాధి, ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు గెజిట్​లో వెల్లడించింది. ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్​ మొదలైన రంగాలలో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు హైదరాబాద్ నగరం ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని, ప్రగతి శీల విధానాల ద్వారా రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు నగరాన్ని అతలాకుతలం చేస్తుండటంతో వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

Hydra Powers Extend : ప్రకృతి వైపరీత్యాలను, విపత్తులను ఆ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, విలువైన ఆస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏజెన్సీ ద్వారా ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవచ్చని గెజిట్ లో పేర్కొంది. విపత్తులు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలంటే జీహెచ్ఎంసీ చట్టం 1955కు అవసరమైన సవరణలు చేయడం తప్పనిసరిగా పరిగణించాలని భావించింది.

అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 213 క్లాజ్ 1 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ -2024ను పంపింది. ప్రధాన చట్టంలోని సెక్షన్ 374-ఏ తర్వాత కొత్త సెక్షన్​గా ప్రభుత్వ ఆస్తుల రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ 374 -బీని చేర్చారు. ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కార్పొరేషన్, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్​ల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

జులై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ని విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ రెండు నెలలుగా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రా చట్టబద్దతపై అనేక ప్రశ్నలు లేవనెత్తడం, న్యాయస్థానాలు కూడా ప్రశ్నించడంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్డినెన్స్​కు అనుగుణంగా జీవో 99లోనూ మార్పులు జరుగనున్నాయి. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి.

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

హైడ్రా జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్ - మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు - TELANAGANA HIGH COURT ON HYDRA

Last Updated : Oct 5, 2024, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details