తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌-2 పరీక్షలు రాస్తున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి - GROUP 2 EXAM IN TELANGANA

ఈ నెల 15, 16న గూప్ర్​ 2 పరీక్షలు - రెండ్రోజుల పాటు నాలుగు పేపర్లు - పటిష్ఠ ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ

TGPSC arranged For Group 2 Exam
TGPSC arranged For Group 2 Exam in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

TGPSC arranged For Group 2 Exam in Telangana : రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 సర్వీసుల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు 1,368 కేంద్రాలను సిద్ధం చేసింది. 2022 డిసెంబర్ 29న గ్రూప్‌-2 సర్వీసుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేయగా, 5 లక్షల 51 వేల 943 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పరీక్షలు నిర్వహించేందుకు పలుమార్లు ఏర్పాటు చేసినా, వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. గ్రూప్‌-2 పరీక్ష ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది.

పరీక్షలు ఈ నెల 15, 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్‌-2 హాల్​ టికెట్​తో పాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకు రావాలని సూచించింది. అదేవిధంగా మంగళసూత్రం, గాజులు ధరించవద్దని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని తెలిపింది. పరీక్ష రాసే అభ్యర్థులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాలని, లేదంటే ఓఎంఆర్‌ పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేసింది.

అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు : గ్రూప్​-2 పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే వ్యక్తిగతంగా టీజీపీఎస్సీ సైతం మెసేజ్​ల రూపంలో సూచనలను పంపుతోంది. హాల్ ​టికెట్​పై ఫొటో లేని వారిని పరీక్ష రాసేందుకు అనుమతించమని స్పష్టం చేసింది. ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించుకోవాలని, దీంతో సమయానికి ఎగ్జామ్​ సెంటర్​కు చేరుకోవచ్చని సూచించింది. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకుని రావాలని పేర్కొంది. అభ్యర్థులు ఓఎంఆర్​ షీట్​లో ​తప్పులు లేకుండా బబ్లింగ్ చేయాలని సూచించింది.

జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు : మరోవైపు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ ప్రక్రియలో ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఆ నంబర్లకు ఫోన్​ చేసి ఏ సమస్యలున్నా వివరాలను అడగవచ్చు. ఇంకా అదనపు సమాచారం కావాలంటే టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 23542187/23542185/040-22445566కు కాల్​ చేయొచ్చు. లేదా ఈ మెయిల్​ helpdesk@tspsc.gov.in ద్వారా కూడా సంప్రదించవచ్చు.

మీరు గ్రూప్-2 ఎగ్జామ్ రాస్తున్నారా - ఇవి లేకపోతే పరీక్ష రాసేందుకు 'నో ఎంట్రీ'

ABOUT THE AUTHOR

...view details