Telangana Phone Tapping CaseUpdates :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు విచారించారు. ఆయన్ని ప్రశ్నించిన సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ గేట్లు మూసేసి గోప్యత పాటించారు. సస్పెండైన డీసీపీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి.
Task Force EX OSD Radhakishan Rao Arrested : ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్‌ఔట్ నోటీస్‌లు జారీ చేశారు.
అనూహ్యంగా రాధాకిషన్‌రావు గురువారం ఉదయం పోలీసుల ఎదుటికి వచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చిన ఆయన వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రణీత్‌రావుకు రాధాకిషన్‌రావు ఇచ్చిన ఆదేశాలు అక్కడి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చారని రాధాకిషన్‌రావును ఆరా తీశారు.
హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ రావు - నేడు వికారాబాద్ తీసుకెళ్లి విచారణ
ఫోన్ ట్యాపింగ్(TS Phone Tapping Case)సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు? హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది? పలువురు వ్యాపారస్థులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది.
రాధాకిషన్‌రావు బృందంపై పలు ఆరోపణలు : హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను దారికితెచ్చే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. ఆయనపై సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్‌రావు మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలను ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు.