Telangana Phone Tapping Case Updates :తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. నిన్న అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radhakishan Rao) ఆదేశాల మేరకు పనిచేసినట్లు గట్టుమల్లు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాధాకిషన్‌రావును కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు అయిదు రోజుల పోలీసు కస్టడీకీకి తీసుకున్నారు.
Police Investigation on CI Gattumallu :ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు(Praneeth Rao)ను కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 12న అరెస్ట్ చేశారని, ఇప్పటికే 14 రోజులు గడిచిన నేపథ్యంలో పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దంటూ ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేసిన వీరంతా ప్రముఖులపై నిఘా పెట్టి, తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వ్యాపారులతో అధికారుల సాన్నిహిత్యం :మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలో బేగంబజార్‌లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. బేగంబజార్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తరచూ సోదాలు నిర్వహించేవారు. ఆ ప్రాంతంలో గంజాయి, హవాలా దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులతో ఒకరిద్దరు టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులకు సాన్నిహిత్యం ఏర్పడిందనే ప్రచారముంది. ఆ క్రమంలో వారితో ఆర్థికలావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.