Telangana Phone Tapping Case Update :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు 7 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ మేరకు ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించుకున్నారు.
జైలులోని లైబ్రరీకి వెళ్లేందుకు తనను అనుమతించడం లేదని న్యాయస్థానానికి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు. అలాగే జైలు సూపరింటెండెంట్‌ను కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదుపై కోర్టు పోలీసులను పిలిచి ప్రశ్నించింది. రాధాకిషన్‌రావుకు లైబ్రరీకి వెళ్లేందుకు, సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు - ఆ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం!
ప్రత్యేక పీపీని నియమించే యోచన ప్రభుత్వం :ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రత్యేక పీపీ (Special PP Appoint)ని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయాలు అన్నీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మరింత మందికి నోటీసులిచ్చే యోచన : కోర్టుకు తీసుకుని వెళ్లడానికి ముందు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారం రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు చెప్పిన కీలక విషయాలను పోలీసులు వాంగ్మూలంలో రికార్డు చేసినట్లు సమాచారం.
హార్డ్ డిస్కుల ధ్వంసం తెచ్చిన తంట - దశాబ్దాల నుంచి సేకరించిన డేటా మొత్తం మాయం
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!