Telangana Job Calendar Release Today :రాష్ట్రంలో రానున్నఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. వేర్వేరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసే నెల, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే వివరాలను జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చింది. నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను వివరించింది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని, గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్‌లో, గ్రూప్-3 పరీక్షలు నవంబర్‌లో నిర్వహిస్తామన్నారు. కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిపికేషన్లు విడుదలై పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు.
TGPSC Job Calendar 2024 : ఈ ఏడాది అక్టోబర్‌లోనే మరోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్‌ను 2025 జులైలో నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో తెలిపింది.
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ట్రాన్స్‌కోలో వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.