తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు అలర్ట్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి - నెల ముందుగానే తరగతులు స్టార్ట్! - TELANGANA HIGHER EDUCATION 2024

ప్రస్తుతం అస్తవ్యస్తంగా వృత్తి విద్యా సంవత్సరం - సమస్యలు అధిగమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు

Telangana Higher Education
Telangana Higher Education Problems 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 7:12 AM IST

Telangana Higher Education Problems 2024 : రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా తయారయింది. ఇంజినీరింగ్ తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. బీఫార్మసీ కౌన్సెలింగ్ ఇప్పటికీ కొనసాగుతుంది. పలు కోర్సుల స్పాట్ ప్రవేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆయా కోర్సులకు సంబంధించి విద్యా సంవత్సరం లేటుగా ప్రారంభం కావడంతో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎక్కువ సమయం ఉండట్లేదు. ఈ గందరగోళానికి అడ్డుకట్ట వేయాలని, వచ్చే విద్యా సంవత్సరాన్ని కనీసం నెల రోజులైనా ముందుకు జరపాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆ దిశగా నూతన ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యామండలి ఛైర్మన్‌ సమీక్ష: అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆగస్టు తొలి వారంలో బీటెక్‌ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా ముందు వరకు అలాగే ఉండేది. కానీ ఆ తర్వాత పరిస్థితి గాడి తప్పింది. తెలంగాణలో కొన్ని కోర్సులకు ముందుగా తరగతులను ప్రారంభించే అవకాశమున్నప్పటికీ, ఇతర కోర్సులకు, జాతీయ స్థాయి ప్రవేశాలకు ముడిపడి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ సమీక్షించారు. త్వరలో వర్సిటీల ఉపకులపతులతో సమావేశమై దీనిపై చర్చించనున్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను చక్కదిద్దుకోవడంతో పాటు జాతీయస్థాయిలో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపడం ద్వారా పరిష్కారం కోసం భావిస్తున్నారు. అవసరమైతే ఎప్‌సెట్, ఇతర ప్రవేశ పరీక్షలను మే నెల రెండో వారం నుంచి కాకుండా ఏప్రిల్‌ చివరి నుంచే ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆలస్యానికి కారణాలు : ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఎప్‌సెట్‌ను ఏటా మే నెల రెండో వారంలోనే ప్రారంభిస్తున్నారు. వాటి ఫలితాలు 10 రోజుల్లో విడుదలచేస్తారు. కానీ ఏఐసీటీఈ అనుమతులు ఆలస్యం కావడం, ఆయా వర్సిటీలు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుండటం, జోసా కౌన్సెలింగ్‌ వరకు చివరి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా ఆపడం వంటి కారణాలతో తరగతుల ప్రారంభంలో జాప్యం జరుగుతూ వస్తోంది. దీనికి పరిష్కారంగా రెండు విడతల కౌన్సెలింగ్‌ల తర్వాత తరగతులు ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాల విడుదలలో జాప్యంతో ఎంబీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ తదితర కోర్సుల ప్రవేశాలు జరపలేకపోతున్నారు. బీఫార్మసీ, బయోమెడికల్, ఫార్మా-డి తదితర కోర్సుల కోసం ఫార్మసీ కౌన్సెలింగ్‌ నిర్వహిద్దామనే ఆలోచన చేస్తున్నా నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌ ప్రవేశాలు పూర్తి కావడం లేదు. కొందరు విద్యార్థలకు ఎంబీబీఎస్‌ సీట్లు రానిపక్షంలో బీఫార్మసీలో చేరుతారు. ఇలా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుందని అధికారులు ఛైర్మన్‌ తెలిపారు.

ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ, సీట్ల భర్తీ చేద్దామంటే ఆయా కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే ఆయా వర్సిటీలు డిగ్రీ పరీక్షలను సకాలంలో నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తే బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల తరగతులైనా త్వరగా ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

జాబ్ చేస్తూ బీఈడీ చదవాలనుకుంటున్నారా?- నిపుణులు ఏమంటున్నారంటే?

నగర బ్రాండ్​ పెంపే లక్ష్యంగా సర్కార్​ అడుగులు - హైదరాబాద్​కు విదేశీ వర్సిటీలు?

ABOUT THE AUTHOR

...view details