Telangana High Court on MBBS Admissions :ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు పిటిషనర్ నంబర్లో జాబితా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని స్పష్టం చేసింది. ఇందుకు ఈనెల 24 లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీస్ అడ్మిషన్ నిబంధనలను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. జీవో ప్రకారం విద్యార్థులు 9,10 తరగతులతో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలని ఉందన్నారు. ఈ నిబంధనలు చట్టవిరుద్ధమని అందుకే జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాం మూర్తి, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను ఇతర రాష్ట్రాల్లో చదివారని వారంతా ఇక్కడే పుట్టి పెరిగినా, 10వ తరగతి వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం స్థానికత వర్తించదని అన్నారు.
అదే ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివి ఇక్కడ పుట్టకపోయినా వారికి స్థానికత వర్తిస్తుందని ఇది రాజ్యాంగ హక్కులను కాలరాసినట్లేనని అన్నారు. వైద్య విద్య సీట్ల భర్తీలో శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికంగానే పరిగణించాలని గత సంవత్సరం ఇదే న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గుర్తు చేశారు.