Phone Tapping Case in Telangana High Court : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనుసరిస్తున్న విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో పోలీసు కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలను తాము అన్వయించుకోవడం లేదని, ప్రత్యేకంగా అన్ని వివరాలతో సమగ్రంగా కౌంటరు దాఖలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తల ప్రచురణ, ప్రసారంలో సంయమనం పాటించాలని మీడియాకు హైకోర్టు సూచించింది. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో పిటిషన్ తీసుకున్న హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.
ఈ కేసులో అన్ని అధికారాలు హోంశాఖ కార్యదర్శికే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తుపై పోలీసు కమిషనర్ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. కమిషనర్ పేర్కొన్న అంశాలకే పరిమితం కాకుండా, ఫోన్ టాపింగ్ దర్యాప్తులో అనుసరించిన విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కౌంటరు దాఖలు చేస్తామని మూడు వారాల గడువు కావాలని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 20కి వాయిదా చేస్తూ ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.