Telangana High Court on EWS Certificate Issue : గిరిజన సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని ఓ అప్పీలు సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. దానికి విరుద్ధంగా తరువాతి సంవత్సరాల ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను అనుమతించే ప్రక్రియను ఆదేశించలేమని పేర్కొంది. గిరిజన సంక్షేమ శాఖలోని పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో తాత్కాలిక జాబితాను 2024లో విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే 2021-22 నాటి ధ్రువీకరణ పత్రాన్నే సమర్పించాలని కోరింది.
నిరాకరించిన టీజీపీఎస్సీ : హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-2 పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్ధిపేటకు చెందిన కె. తిరుపతి అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించగా టీజీపీఎస్సీ నిరాకరించింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి కూడా తిరస్కరించారు. వెంటనే తిరుపతి హైకోర్టులో అప్పీలును దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రస్తుత సంవత్సరాలవే చెల్లుబాటు : ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రస్తుత సంవత్సరాలకే జారీ చేయాలని, గతేడాదికి సంబంధించిన దానికి విడుదల చేయరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషనర్ తిరుపతి 2021-22 సర్టిఫికెట్‌ను సమర్పించలేకపోతున్నట్లు చెప్పారు. అయితే టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్నవారందరూ 2021-22 నాటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సమర్పించారని, అందువల్ల అధికారులు ధృవీకరణ పత్రాలను జారీ చేయలేదనే కారణం సరికాదన్నారు.