High Court On Indiramma Committees :ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 సబబేనని ఈ మేరకు హైకొర్టు పేర్కొంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్లకు అధికారాలను కల్పిస్తూ జారీ అయిన జీవో 33ను సవాలు చేస్తూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల తీర్పును వెలువరించారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ గ్రామసభ, వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడమనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత సర్కారు డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసిందన్నారు.
గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక :ఇందిరమ్మ కమిటీల సభ్యుల నియామకాలకు సంబంధించిన జీవోలో(ఉత్తర్వుల్లో) ఎలాంటి అర్హతలను పేర్కొనలేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచి/స్పెషల్ ఆఫీసర్, వార్డు స్థాయిలో కౌన్సిలర్/కార్పొరేటర్ ఛైర్మన్‌గా ఉంటారని తెలిపారు.