TG High Court On KTR Formula E Car Race Case : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌పై వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
ఇవాళ కేటీఆర్ పిటిషన్‌పై ఇప్పటికే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశామనని ఏసీబీ తెలిపింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారా అని అడిగిన హైకోర్టు, ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది.
విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో రూ.46 కోట్లను చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థికశాఖ అనుమతి ఉండాలన్న ఏసీబీ, ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారని కౌంటర్‌లో పేర్కొంది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని వాదించారు. ఫార్ములా-ఈ కార్ల రేసు నిర్వహణ ఒప్పందంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు.
ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు :కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని వాదించిన సీనియర్ లాయర్ సిద్దార్థ్ దవే, అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదని తెలిపారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని కోరారు. భోజన విరామం తర్వాత ఏజీ, గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న దానకిషోర్ లాయర్ కోర్టుకు వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఈ-కార్ల రేసింగ్ సీజన్-10 ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని తెలిపారు. రూ.46 కోట్లను బ్రిటన్ పౌండ్లు రూపంలో చెల్లించారని వివరించారు. ఈ క్రమంలో దర్యాప్తు ఏ దశలో ఉందని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు ఏజీ తెలిపారు.