High Court comments On EX collector Amoy Kumar: భూదాన్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పట్లో అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ (అమోయ్‌కుమార్‌ను ఉద్దేశించి) ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది.
భూదాన్ భూముల రక్షణపై హైకోర్టు :అప్పట్లో భూములను దివానీ, సర్ఫేకాజ్, పట్టాలు అనే మూడు రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు పేర్కొంది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా గతంలో ఉన్న భూదాన్ బోర్డుతోసహా అధికారులు అమ్ముకుని తినేశారని వ్యాఖ్యానించింది.
తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్లు ఉన్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు ఇచ్చేశారన్నారు. భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారంది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుదని ధ్రువీకరించాక వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని అని ప్రశ్నించింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూదాన్ యజ్ఞబోర్డు, వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, అప్పటి డీఆర్‌వో ఆర్.పి.జ్యోతితోపాటు మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది..