Telangana Heavy Rains Effect :రాష్ట్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దవగా, పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద కంబళ్ల శ్రీనివాస్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య, లక్ష్మితో పాటు రేగుల శ్రీనివాస్, దేవయ్యలతో కలిసి చింతకాయలు దులుపుతున్నారు. ఇంతలో గాలి వాన రావడంతో అదే చెట్టు కింద కూర్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
People Died Due to Lightning : సిరిసిల్ల జిల్లాలోనే తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌కు చెందిన రుద్రారపు చంద్రయ్య తన పొలం వద్ద మోటారు ప్యూజులు తొలగించేందుకు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండకు చెందిన పసునూరి ప్రవీణ్ తన మామతో కలిసి ద్విచక్రవాహనంపై తలకొండపల్లి మండలం చెన్నారుకు వెళ్తుండగా వర్షం రావడంతో బస్‌షెల్టర్‌లోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న మాడ్గుల మండలానికి చెందిన గొని నిరంజన్ తీవ్రంగా గాయపడ్డారు.
అకాల వర్షం- తడిసిన ధాన్యం : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి ప్రాంతాల్లో జోరువాన కురిసింది. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూర్ మండలాల్లో చెట్లు నేలకూలగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తోటల్లో పెద్ద ఎత్తున మామిడికాయలు నేల రాలాయి.